Monday, September 3, 2007

100 సంవత్సరాలకుపైగా తమిళనాట తెలుగు కీర్తి పతాకాన్ని ఎగురవేస్తున్న ఎ.బి.టి.ఎం.పాఠశాల.






"తెలుగదేలయన్న దేశంబు తెలుగు
ఏను తెలుగు వల్లభుండ తెనుగొకొండ
ఎల్ల నృపులుకొలువ ఎరుగవే బాశాడి
దేశ భాషలందు తెలుగులెస్స "
అంటూ 16వ శతాబ్దంలోనే తెలుగు వారి కీర్తి పతాకాన్ని విశ్వవ్యాపితం చేసిన శీకృష్ణ దేవరాయలు వ్రాసిన పద్యం అది.
జగద్విఖ్యాతమైన తెలుగు గొప్పదనాన్ని వందసంవత్సరాలుగా తమిళ నేలపై విస్తరిస్తూ విజయ పథంలో మున్ముందుకు వెల్తున్న ఘనమైన చరిత్ర ఎ.బి.టి.ఎం.మాధ్యమిక పాఠశాల స్వంతం. 18వ శతాబ్దం చివరి కాలంలో చెన్నపట్టణంగా ఆనాడు పిలిచే ఈనాటి చెన్నైలోని సెయింట్ థామస్ మౌంట్ లో వుండే నజరేతుపురం అనే చిన్న పట్టణంలో అప్పటి పాలకులైన ఆంగ్లేయులు చిన్న బడిని ప్రారంభించారు. విద్య అందుబాటులో లేని ఆనాడు 3వ తరగతి వరకు ప్రారంభించిన ఈ పాఠశాలలో మాతృభాష అయిన తెలుగులో విద్యాభ్యాసం నేర్చుకునే అవకాశం ఆనాటి స్థానికులైన తెలుగువారికి దొరికింది. అనంతరం పాస్టరు నారయ్య అప్పటి ఆంగ్లేయులతో చేరి సెయింట్ థామస్ మౌంట్ అనే చర్చిని స్థాపించి తద్వారా తెలుగు విద్యాబోధనకు పాటుపడి అప్పటి ప్రజలకు నిరంతరమైన సేవ చేసారు. 1945 వ సంవత్సరంలో జరిగిన రెండవ ప్రపంచ యుద్దం తర్వాత ఈ చర్చిని, పాఠశాలను పాస్టరు నారయ్యకు ఆంగ్లేయులు అప్పచెప్పారు. చదువు విలువ తెలియని స్థానికులు అనేకమంది తమ పిల్లలను తమతో పనికి తీసుకుని వెల్లేవారు. అది చూసిన నారయ్య తల్లిదండ్రులతో మాట్లాడి పిల్లలను పాఠశాలకు వచ్చేలా చేసి వారిని ప్రొత్సహించి వారి బంగారు భవితవ్యానికి బాటలు వేసారు. అలా పని పేరుతో ఎంతోమంది బాలల జీవితాలు కొడిగట్టకుండా కాపాడి వారిని భావిపౌరులుగా తీర్చిదిద్దిన ఘన చరిత్ర నారయ్యది. 1902 నుంచి మొదలు ఉచిత విద్యతో బాలల భవితకు బాటలు వేసిన నారయ్య పాఠశాలను 1907లో 5వ తరగతికి, 1964లో 8వ తరగతికి అభివృద్ది చేసారు. పాస్టరు కె.నారయ్య గారు స్వర్గస్తులైన తర్వాత వారి కుమారుడైన కె.ఎన్.విక్టర్ పాఠశాల భాద్యతలను తీసుకుని పూరి పాకగా ఉన్న పాఠశాలను సిమెంట్, రేకులతో అభివృద్ది చేసారు. తదనంతరం పలు అభివృద్ది పనులు చేసి పాఠశాలకు నీటి వసతిని, మరుగు దొడ్లను, ఫ్యాన్, లైట్ తదితర అనేక వసతులను నెలకొల్పి, విద్యార్థులకు యూనిఫాం ఏర్పాటు చేయడమే కాకుండా తమిళ, ఇంగ్లీషు భాషలను అదనంగా చేర్చి పాఠశాలను ఉన్నత స్థాయిలోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం 8వ తరగతి వరకే ఉన్న పాఠశాలను 10వ తరగతిదాకా అభివృద్ది చేయడంకోసం కృషి చేస్తున్నారు. ఎవరి సహాయ, సహకారాలు లేకుండా నిరంతర విద్యా బోధనలో మున్ముందుకు వెలుతున్న ఈ పాఠశాల మరో వెయ్యేళ్ళు జగద్విఖాతంగా వెలిగిపోవడానికి ప్రతి ఒక్కరూ తమవంతు సహకారాన్ని అందించాలి.